కృష్ణ: అర్జునా, యుద్ధక్షేత్ర మధ్యలో ఇలా సంకల్పం లేకుండా ఉండటం నీ వంటి యోధుడికి కీర్తికరం కాదు. నీ ఈ సంధిగ్ధాలను దాటి యుద్ధాన్ని ఆరంభించు.
అర్జున: నాకు దైవ సమానులైన భీష్మ ద్రోణాదుల మీద అస్త్రాలను ఎలా ప్రయోగించగలను? వారిని వధించి వొచ్చే భోగాలను ఎలా అనుభవించగలను? యుద్దాన్ని చేయటం, చేయకపోవడంలో ఏది మంచిదో నాకు అర్థంకావటంలేదు. వొకవేళ యుద్ధం చేసి గెలిచినా, ఇంత మందిని చంపిన తరువాత జీవితేశ్చ ఎలా ఉంటుంది?
కృష్ణా, నాకు ఏమి చెయ్యాలో బాధపడటం లేదు. నాపై దయవుంచి నేను చేయదగినది ఎదో నాకు తెలుపు.
కృష్ణ: అర్జునా, నీ మిడిమిడి జ్ఞానంతో నువ్వు అత్యంత ప్రజ్ఞ కలవాడిలా మాట్లాడుతున్నావు. ధుఃకింప తగని వారిని గూర్చి బాధపడుతున్నావు. పండితులు ఉన్నవారిని గురించి గాని చనిపోయిన వారిని గురించిగాని ధుఃఖించరు.
అందరిలో ఉండే ఆత్మను అర్థంచేసుకో. నువ్వు, నేను, సమస్త జీవులు ఎల్లప్పుడూ ఉంటారు. ఏ విధంగా అయితే చిరిగిన వస్త్రాలను వొదిలి కొత్త వస్త్రాలను ధరిస్తామో, అదే విధంగా ఆత్మ ఒక శరీరం వొదిలి మరో కొత్త శరీరాన్ని పొందుతుంది. ఇప్పుడు ఉన్నది ఎల్లప్పుడూ ఉంటుంది, ఇప్పుడు లేనిది మరెప్పుడూ లేదు. ఈ ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు. ఈ ఆత్మ చంపును అని లేక చచ్చును అని అనుకోవటం అజ్ఞానం. ఈ ఆత్మను ఏ ఆయుధమూ ఛేదించలేదు, నిప్పు కాల్చలేదు, నీరుతడుపలేదు, గాలి ఆర్పివేయను సమర్ధము కాదు.
అర్జునా, ఈ ఆత్మ మాటిమాటికీ పుడుతుంది మరణిస్తుంది అని అనుకున్నా కూడా బాధపడక్కరలేదు. పుట్టిన వారికి మరణం ఎంత నిజమో, మరణించిన వారికి పునర్జమ్మము అంతే నిజం. తప్పించలేని విషయాల గురించి బాధపడి లాభమేమిటి. ఒక యోధునికి ధర్మం వైపు నిలబడి యుద్ధం చేయటం కన్నా మహాభాగ్యం మరొకటి లేదు. ఇది స్వర్గానికి సరాసరి మార్గం. ఇటువంటి ధర్మ యుద్ధం చేయకపోవటం అపకీర్తిని తెచ్చుకోవటమే. యుద్ధ క్షేత్రం మధ్యలో నుంచి వెళ్లడాన్ని, బయపడి పారిపోవటంగా తలుస్తారు. మర్యాదస్తునికి ఇటువంటి నింద చావుకన్నా భయంకరమైనది. యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గాన్ని పొందుతావు, గెలిస్తే భూమిని పాలిస్తావు. కాబట్టి యుద్ధం చేయటమే నీకు ఉత్తమం. సుఖదుఃఖాలను, జయాపజయాలను, గెలుపోటములను ఒకటిగా తలచి యుద్ధం చెయ్యి, అప్పుడు ఏ పాపం నీకు అంటదు.
అర్జునా, ఇప్పటి వరకు నీకు ఆచరణాత్మకమైన కార్యాచరణను చెప్పాను. ఇప్పుడు అన్ని బన్ధనాల నుంచి విముక్తి ఇవ్వగల కర్మ యోగం గురించి చెప్తాను. నువ్వు చేసే పనిని కర్మయోగం అనుసరించి పూర్తిచేస్తే ఫలితం వొస్తుంది, అదే పూర్తిచేయలీకపోతే భయం పోతుంది.
సామాన్యులు తమ ఆలోచనలను కేవలం వారు చేసే పని ఫలితం మీద ఉంచుతారు. వారు చేసే ప్రతి పనికి కలిగే ప్రయోజనం గురించే ఆలోచిస్తారు. తమకు స్వర్గప్రాప్తి అందిస్తాయి అనే పనులపైనే శ్రద్ద పెడతారు. వారి మనస్సు కోరికలతో నిండి ఉంటుంది. వినటానికి బాగుగా అనిపించే వీరి మాటలకు ఆకర్షితులై భోగాలను కోరుకునే వారికి మనఃశాంతి కలుగదు.
అర్జునా, కర్మలను చెయ్యటం పైనే నీకు అధికారం ఉంటుంది, వాటిని ఫలితం ఆశించి చెయ్యకు. ఫలితం గురించి ఆలోచించి కర్మలను చెయ్యటం మానరాదు. ఆ విధంగా కర్మలను చేయటం వలన మోక్షమును పొందగలవు.
అర్జున: కృష్ణా, స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమి? వారు ఎలా మాట్లాడతారు? ఎలా వ్యవహరిస్తారు?
కృష్ణ: మనస్సులోని కోరికలను వొదలి, సంతోషంగా ఉన్నవారిని స్థితప్రజ్ఞులు అని అంటారు. వారు దుఃఖాలకు దిగులు చెందరు, సుఖాలకు పొంగిపోరు. వారిని అనురాగము భయము కోపము అంటవు. ఇంద్రియములు ఎవరి ఆధీనంలో ఉంటాయో వారి మనస్సు స్థిరంగా ఉంటుంది.
సుఖాలపై ఆసక్తి ఉండటం వలన, వాటిపై ఆకర్షణ కలుగుతుంది. ఆకర్షణ కోరికగా మారుతుంది, కోరిక క్రోధానికి కారణం అవుతుంది, క్రోధం వలన అవివేకం కలుగును, అవివేకం బుద్ధిని నాశనం చేస్తుంది. ఒకసారి బుద్ధి నాశనం అయితే, మొత్తం వినాశనమే.
మనస్సు ప్రశాంతంగా ఉంటె అన్ని దుఃఖాలు నశిస్తాయి, స్థిరమైన ఆలోచనలు ఉంటాయి. అదే ప్రశాంతత లేకపోతె తెలివైన ఆలోచనలు రావు, అది అశాంతికి కారణం అవుతుంది. అశాంతి ఉన్నప్పుడు సుఖమే ఉండదు.
ఇంద్రియాలను కోరికల నుంచి పూర్తిగా నిగ్రహించిన వారి ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. వారే స్థితప్రజ్ఞులు.
Comments
Post a Comment