అర్జున: కృష్ణా, కర్మ చెయ్యటం కంటే జ్ఞానము, స్థిత ప్రజ్ఞతే శ్రేష్టమైతే. ఈ ఘోరమైన యుద్ధమనే కర్మని ఎందుకు చెయ్యమంటున్నావు. నీ మాటలతో నాకు మరింత గజిబిజిగా ఉంది. నాకు శ్రేయస్కరమైన మార్గమేదో సూటిగా చెప్పు.
కృష్ణ: ఈ ప్రపంచాన్ని సృష్టించేటప్పుడే రొండు మార్గాలను కూడా సృష్టించాను. జ్ఞానాన్ని కోరుకునేవారికి సంఖ్యా శాస్త్రాన్ని, యోగులకు కర్మయోగాన్ని. కేవలం బౌతికంగా కర్మలను చేయకపోవటం వల్ల కర్మ ఫలితంపై ద్యాస పోదు, అలానే కర్మలను వదలుట వల్ల జ్ఞానము సిద్దించదు. కేవలం భౌతికంగా కర్మలకు దూరంగా ఉంటూ, వాటి గురించి ఆలోచిస్తూ ఉండటం పాపమే. ప్రజ్ఞాశాలి తను చేయవలసిన కర్మలను ఫలితం గురించి ఆలోచించకుండా చేయును. బాధ్యతలను విస్మరించడం వల్ల జీవిత ప్రయాణం సాఫీగా సాగదు.
ముల్లోకాలలో నేను పొందవలసినది ఏదీ లేదు, కానీ నన్ను అనుసరించే జనుల ప్రయోజనం కోరి, వారికి మార్గదర్శనంచేయుటకు కర్మలను ఆచరిస్తూనే ఉంటాను. ఆలా నేను చెయ్యకపోతే, నన్ను అనుసరించే జనులు కూడా వారు చెయ్యవలసిన కర్మలను చెయ్యటం మానేస్తారు. ఇది జగత్తుకు మంచిది కాదు. పూర్ణజ్ఞాని ఐన వాడు అల్పజ్ఞాని ఐన వారిని, వారి దారినుండి వైదొలగించరాదు. ఆసక్తి లేకపోయినా కూడా, లోక శ్రేయస్సు కొరకు శ్రద్ధతో చెయ్యవలసిన కర్మలను చెయ్యవలెను.
అర్జునా! నీవు చేసే సమస్త కర్మలను నాకు సమర్పించి, మోహము లేకుండా యుద్ధము చెయ్యుము. ఆ విధముగా చెయ్యటం వలన, కర్మ నిన్ను అంటదు. కర్మను వొదిలివెయ్యటం మంచిగా అనిపించొచ్చు, కానీ తప్పైననూ ఆచరించ వలసిన కర్మను ఆచరించటమే మంచిది. అలాచేస్తూ మరణించినా మంచిదే.
అర్జున: మనిషి తనకు ఇష్టము లేకపోయినా కూడా, దేనిచేతో నెట్టబడినట్టు పాపము ఆచరిస్తున్నాడు. ఆ శక్తి ఏది?
కృష్ణ: ఆ శక్తి రజోగుణమున పుట్టిన కామ క్రోధాలు. అవే పాప కారకాలు, మనిషికి అవే శత్రువులు అని తెలుసుకొనవలెను. నిప్పును పొగ, అద్దాన్ని దుమ్ము కప్పివేసినట్టు, ఈ కామము మన జ్ఞానాన్ని కప్పివేస్తుంది.
ఈ కామం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ద్వారా, జ్ఞానాన్ని ఆవరించి మనిషిని వశం చేసుకుంటుంది. కాబట్టి మొదట ఇంద్రియములను అదుపులో పెట్టుకొని కామాన్ని పార ద్రోలుము.
Comments
Post a Comment